దిక్కుమాలిన సినిమాకి “దిల్ రాజు” సపోర్ట్…!

ఆ మధ్య “ఈరోజుల్లో & బస్ స్టాప్” సినిమాలు హిట్టయ్యాక దర్శకుడు మారుతి నిర్మాత అవతారమెత్తి అడ్డమైన సినిమాలనూ జనాల మీదకు వదిలాడు.ఇప్పుడు మరీ ఆ స్థాయిలో కాకున్నా అందులో కొంత బాధ్యత ప్రముఖ నిర్మాత “దిల్ రాజు” తీసుకున్నట్టు కనిపిస్తున్నాడు.కొంత కాలం క్రితం “రోజులు మారాయి” అంటూ వచ్చిన ఓ సెమీ బి-గ్రేడ్ సినిమాతో వచ్చిన మన రాజు,ఇప్పుడు “వెళ్ళిపోమాకే” అంటూ మరో సినిమాతో వస్తున్నాడు…పైగా అది ఫీల్ గుడ్ మూవీ అట.ఉప్పు-కారం లేకుండా,రుచీ-పచీ తెలియకుండా చప్పగా అఘోరించే వంటలు ఆరోగ్యానికి మంచివి అన్నట్టు,జీవం లేకుండా నీరసంతో చంపేసే సినిమాలే ఫీల్ గుడ్ సినిమాలుగా వీళ్ళు భ్రమపడటం ప్రేక్షకులు చేసుకున్న అతి పెద్ద దురదృష్టం.

2.14 నిమిషాల నిడివి కలిగిన “వెళ్ళీపోమాకే” సినిమా ట్రైలర్ చూడండి,ఆ రెండు నిమిషాలలోనే మీకు సగం జీవితం గడిపేసిన ఫీలింగ్ కలుగుతుంది.మొదటి ఫ్రేం వద్ద నుంచి చివరి వరకూ మనకి బోర్ కొట్టించడంలో ఎక్కడా ఫెయిల్ కాలేదు ఆ ట్రైలర్.ఇప్పుడు నా సమస్య ఏమిటంటే,రెండు నిమిషాల ట్రైలర్లోనే సగం జీవితం గడిపేసిన ప్రేక్షకుడుకి,రెండున్నర గంటల సినిమా చూడటానికి ఆయుష్షు సరిపోతుందా అని.

తెలుగు సినిమాకు సంబంధించినంత వరకూ “దిల్ రాజు” అంటే ఒక బ్రాండ్.ఆయన నిర్మించిన సినిమాల క్వాలిటీ ఆయనకు ఆ పేరు తెచ్చి పెట్టింది.గతంలో “దిల్ రాజు” డబ్ చేసిన కొన్ని “వైశాలి” వంటి చిన్న సినిమాలు కూడా ఆయన స్థాయిని పెంచాయే తప్ప తగ్గించలేదు.కాని ఇప్పుడు చేస్తున్న ఈ “వెళ్ళిపోమాకే” వంటి సినిమాల వల్ల భవిష్యత్ లో “వెళ్ళిపోమాకే” ప్రేక్షకులను బ్రతిమాలుకునే పరిస్థితి రావచ్చు…కాబట్టి ఇప్పుడే జాగ్రత్త పడితే మంచిది.

అసలు సినిమా విడుదల కాకుండానే ఫలితాన్ని ఎలా ఊహిస్తున్నారనే సందేహం మీకు రావచ్చు.అలా ఊహిస్తున్నారంటే,”వెళ్ళిపోమాకే” ట్రైలర్ మీరు చూడలేదని అర్ధం.రెండు నిమిషాల ట్రైలర్ ని కూడా పూర్తిగా చూడలేని పరిస్థితి ఉంటే,రెండున్నర గంటల సినిమా ప్రేక్షకుడు చూడటం దాదాపు అసాధ్యం. నూటికి తొంభైతొమ్మిది సార్లు సినిమా బాగుంటుందో లేదో ట్రైలర్ చెప్పేస్తుంది.అలా చెప్పబట్టే “పెళ్ళి చూపులు,కార్తికేయ” వంటి సినిమాలకు పెద్ద హీరోలు లేకపోయినా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ “వెళ్ళిపోమాకే” ని ప్రేక్షకులు “వెళ్ళిపొమ్మనే” అవకాశాలే ఎక్కువ…అంతే.

More from my site

Comments

comments