నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి ఈసీ షాక్.

నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ఏపీ అధికారపక్ష నేతలు చేసిన పనులు అన్నిఇన్ని కావు. అయినప్పటికీ వారి తప్పులపై అధికారులు స్పందించాల్సిన స్పందించలేదన్న విమర్శ వారిపై ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఏపీ అధికారపక్ష అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డికి షాకింగ్ గా మారిందని చెబుతున్నారు. ఎన్నికల వేళ.. ఎన్నికల సంఘానికి సబ్ మిట్ చేసే పత్రాలకు సంబంధించి జరిగిన నిర్లక్ష్యం పుణ్యమా అని తిప్పలు ఎదురయ్యేలా ఉన్నాయన్న భావన వ్యక్తమవుతోంది.

నంద్యాల ఉప ఎన్నికలో తాను పెట్టిన ఖర్చుతో పాటు.. స్టార్ సెలబ్రిటీల క్యాంపెయిన్ ఖర్చును తన ఖాతా కిందకు పరిగణలోకి తీసుకోకుండా ఆ సమాచారాన్ని ఎన్నికల సంఘానికి అందించాల్సి ఉంది. అయితే.. ఈ విషయంలో ఏపీ టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ప్రదర్శించిన నిర్లక్ష్యం ఇప్పుడు ఆయనకు చిక్కుల్లో పడేసేలా మారిందని చెబుతున్నారు.

నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రచారం చేసిన స్టార్ క్యాంపెయిననర్స్ ఖర్చును గడువు లోపల ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉంది. కానీ.. ఆ విషయంలో చోటు చేసుకున్న తప్పు కారణంగా స్టార్ క్యాంపెయినర్స్ పెట్టిన ఖర్చు కూడా అధికారపార్టీ అభ్యర్థి ఖాతాలోకే లెక్క కట్టనున్నారు. ఇదే జరిగితే అధికారపార్టీ అభ్యర్థి ఖర్చు లెక్క తడిచి మోపెడు కానుంది. ఎన్నికల సంఘం పరిమితిని దాటితే లేనిపోని తిప్పలు ఖాయమంటున్నారు. మొత్తం ఖర్చు 28 లక్షలు దాటకూడదు. దాటితే భూమా అభ్యర్థిత్వం రద్దవుతుంది.

భూమా తరఫున స్టార్ క్యాంపెయిన్ జరిపిన ప్రముఖులు.. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హిందూపురం అధికార పార్టీ ఎమ్మెల్యే  కమ్ సినీ నటులు బాలకృష్ణ.. కొందరు మంత్రులు ప్రచారం చేశారు. వీరి ప్రచారానికి అయిన ఖర్చును విడిగా పంపాల్సి ఉంది. కానీ.. గడువు లోపు లెక్కను పంపకపోవటంతో వారందరి ఖర్చు సైతం టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఖాతాలో పడనుందని చెబుతున్నారు. ఇప్పుడు సమస్య అంతా ఏమిటంటే.. బ్రాహ్మానందరెడ్డి పెట్టిన ఖర్చు.. స్టార్ క్యాంపైనర్లు పెట్టిన ఖర్చు కలిపి.. ఎన్నికల సంఘం నిర్దిష్ట పరిమితికి లోబడి ఉంటే ఓకే. ఏ మాత్రం తేడా కొట్టినా.. భూమా బ్రహ్మానంద రెడ్డి ఎమ్మెల్యే పదవి రద్దవుతుంది. కొత్త విషయం తెర మీదకు రావటంతో టీడీపీ శ్రేణులు ఇప్పుడు లెక్కల్లో బిజీబిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

More from my site

Comments

comments