అతను బాలయ్యకు బలం…మిగిలిన వాళ్ళకు భారం!

పైన మీరు చదివిన మాట దర్శకుడు బోయపాటి గురించి.మీరు బోయపాటి శ్రీనివాస్ సినిమాలను గమనిస్తే యాక్షన్ సన్నివేశాలు,మాస్ ఎలిమెంట్స్ ఆహా అనిపించే రీతిలో ఉంతాయి.కాని కధ మాత్రం నిరుత్సాహపరుస్తుంది.ఈరోజుల్లో కథ ఎలా ఉన్నా,కథనం విషయంలో జాగ్రత్త పడితే ప్రేక్షకాదరణకు లోటుండదు.కథనంతో పాటు కథానాయకుని పాత్ర విషయంలో వైవిధ్యం చూపిస్తే సూపర్ హిట్ గ్యారంటీ.

బోయపాటి ఇప్పటివరకూ చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు,బాలయ్య “సింహా” ఒక ఎత్తు.నందమూరి బాలకృష్ణ అంటే అప్పటివరకూ ఆవేశంతో ఊగిపోయే హీరోగానే తెలుసు ఎక్కువమందికి.ఆ ఆవేశం అభిమానులకు నచ్చినా,మిగిలిన ప్రేక్షకులలో కొంతమందిని ఆయనను దూరం చేసిందనేది వాస్తవం.కాని ఇప్పటివరకూ ఏ దర్శకుడూ చేయని ప్రయత్నాన్ని,ప్రయోగాన్ని బోయపాటి చేసాడు.బాలయ్యతో సెటిల్డ్ పెర్ఫామెన్స్ చేయిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో బోయపాటి చేసి చూపించాడు.”చూడు…ఒకవైపే చూడు” అన్నా,”…నో పోలీస్” అన్నా…ఆ సన్నివేశాలన్నీ బాలయ్య మాత్రమే చేయగలడు అన్నంత అద్భుతంగా పండాయి.ఆ తర్వాత వచ్చిన “లెజెండ్” కూడా “సింహా” స్థాయిలో కాకపోయినా బాగానే ఆకట్టుకుంది.ఇదంతా నాణానికి ఒక వైపు.

బోయపాటి మొదటి సినిమా “భద్ర” లో తప్ప ఇంకెప్పుడూ కొంచెం సెన్సిటివ్ లవ్ స్టోరీని హ్యాండిల్ చెయ్యలేదు.”భద్ర” లో కూడా యాక్షన్ ఉన్నప్పటికీ,మంచి ఫన్ కూడా ఉంటుంది.కాని ఆ తర్వాత “తులసి,దమ్ము,సరైనోడు…ఇప్పుడు జయ జానకి నాయక” అంటూ మొత్తం యాక్షన్ చుట్టూనే బోయపాటి ప్రయాణం నడిచింది.వాటిలో “సరైనోడు” ఒక్కటే సరైన ఫలితాన్నందుకుంది.కాని ఆ “సరైనోడు” సక్సెస్ కూడా ఇప్పుడు బోయపాటి ఖాతాలోంచి అల్లు అర్జున్ ఖాతాలోకి వెళ్ళిపోయేట్టుంది.

ఎందుకంటే,గతవారం విడుదలైన మూడు సినిమాలలో బోయపాటి “జయ జానకి నాయక” వసూళ్ళ పరంగా రెండవ స్థానంలో ఉంది.సరైన ధియేటర్స్ దొరకలేదనే వాదన ఉన్నప్పటికీ,అయిన బిజినెస్ తో పోలిస్తే వసూళ్ళు ఉండాల్సిన స్థాయిలో లేవు అనే వాదన కూడా ఉంది.ఎందుకంటే “లై & నేనే రాజు నేనే మంత్రి” సినిమాలతో పోలిస్తే “జయ జానకి నాయక” దాదాపు రెట్టింపు బిజినెస్ చేసింది.ఇప్పుడు ఈ సినిమా కూడా వాటితో సమానంగా వసూళ్ళు సాధిస్తే బడ్జెట్ ఫెయిల్యూర్ గా నిలిచిపోయే ప్రమాదం ఉంది.దానికి కారణం ముఖ్యంగా బోయపాటి అనేది ఎక్కువమంది అభిప్రాయం.

“జయ జానకి నాయక” లో కూడా బోయపాటి “సరైనోడు” ఫార్ములానే నమ్ముకున్నాడు.యాక్షన్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసే ప్రయత్నం చేసాడు.కాని “సరైనోడు” లో ఉన్నది అల్లు అర్జున్,ఈ సినిమాలో ఉన్నది “బెల్లంకొండ”.”సరైనోడు” లో బోయపాటి ఆలోచనల్లో ఉన్న దాన్ని యధాతధంగా బన్నీ స్క్రీన్ మీద నటించి చూపించాడు.ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం సినిమాని తన భుజాల మీద వేసుకుని లాక్కుపోయాడు.ఇక్కడ “బెల్లంకొండ శ్రీనివాస్” పూర్తిగా తేలిపోయాడు.అతని స్థాయికి మించి నటించినప్పటికీ,సినిమాని మరో స్థాయిలో నిలబెట్టడానికి అది సరిపోలేదు.అంటే కథలోనూ,కథనంలోనూ ఉన్న లోపాలను “సరైనోడు”లో బన్నీ కవర్ చేయగలిగాడు…ఇక్కడ బెల్లంకొండ శ్రీనివాస్ ఆ పని చేయలేకపోయాడు.అంటే ఆ లోపాలను స్క్రిప్ట్ స్థాయిలో గుర్తించలేకపోయిన బోయపాటిదే ఆ పాపం.ప్రతి సినిమాలోనూ అద్భుతంగా నటించగలిగే నటీనటులు దొరక్కపోవచ్చు…కథా కథనాల విషయంలో జాగ్రత్త పడకపోతే అప్పుడు ఇటువంటి ఫలితాలనే ఎదుర్కోవలసి వస్తుంది.

మొత్తంగా చూస్తే ఇప్పటివరకూ బాలయ్యను మాత్రమే,బోయపాటి కొత్తగా చూపించగలిగాడు.మిగిలిన వాళ్ళంతా ఒకే రకమైన బోయపాటి మార్కు కథానాయకులు.వాళ్ళ వాళ్ళ శైలిని బట్టి వాళ్ళు నటించారు.అందులో “సరైనోడు” బాగా వర్కవుట్ అయ్యింది.కాని ఇలా నేలను విడిచి సాము చేసే కథలనే ఎప్పుడూ ఎంచుకుంటే ప్రతి సినిమా “సరైనోడు” కాదనే విషయం బోయపాటికి ఈపాటికైనా తెలిసిందో లేదో.

More from my site

Comments

comments