జనతా గ్యారేజ్ మోహన్‌లాల్ ‘బ్లాక్ మనీ’ సినిమా రివ్యూ

mohanlal-block-money

జనతా గ్యారేజ్ సినిమాకు ముందు కూడా మోహన్‌లాల్ కొన్ని తెలుగు సినిమాల్లో కనిపించాడు. కానీ జనతా గ్యారేజ్ సినిమాతో చాలా మందికి రీచ్ అయ్యాడు. అదే టైంలో మోహన్‌లాల్ కీలకపాత్రధారిగా వచ్చిన మనమంతా అనే సినిమా కూడా మంచి సినిమాలను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు మోహన్‌లాల్‌ని దగ్గర చేసింది. మొత్తంగా జనతా గ్యారేజ్ సినిమాని మలయాళంలో రిలీజ్ చేసినందువళ్ళ ఎన్టీఆర్‌కి ఒరిగింది ఏమీ లేదు కానీ…ఆ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన మోహన్‌లాల్‌కి మాత్రం తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. ఆ మార్కెట్‌ని మోహన్‌లాల్ కూడా బాగానే క్యాష్ చేసుకుంటున్నాడు. ఇంతకుముందు మన్యం పులి, కనుపాప సినిమాలతో ఓ మోస్తరు కలెక్షన్స్ కొల్లగొట్టాడు. ఈ వారం ‘బ్లాక్ మనీ’ అంటూ మరో కొత్త సినిమాతో మనముందుకు వచ్చాడు. మరి ఈ సారి కూడా సక్సెస్ అవుతాడా? రాజకీయ అవినీతి, టెలివిజన్ ఛానల్స్ టీఆర్పీ రేటింగ్స్ పోరాటం నేపథ్యంగా తెరకెక్కిన బ్లాక్ మనీ సినిమాకు టిక్కెట్లు ఏ రేంజ్‌లో తెగే అవకాశం ఉంది?

తెలుగు సినీ పరిశ్రమ వ్యక్తలు రాజకీయ అంశాల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల్లో నటించడానికి పెద్దగా ఉత్సాహం చూపరు. ఎందుకంటే మనవాళ్ళు బాగా కమర్షియల్ హీరోలు కాబట్టి. పొలిటికల్ పార్టీలు అన్నింటితోనూ…మరీ ముఖ్యంగా అధికార పార్టీ నేతలతో మరీ సన్నిహితంగా ఉండి వ్యపాారాలను పెంచుకోవడంపైన దృష్టిపెడతూ ఉంటారు కాబట్టి. రైతుల కష్టాలు నేపథ్యంగా వచ్చిన కత్తి సినిమాను రీమేక్ చేసే దమ్ము కూడా మన హీరోలకు లేకుండా పోయింది. చివరికీ చిరంజీవి కూడా ఆ సినిమాలో ఉన్న రాజకీయ అరాచకాలను తొలగించి కార్పొరేట్ వ్యవస్థను తెరపైకి తెచ్చేలా కథను మార్చిన తర్వాత కానీ ఆ సినిమాలో యాక్ట్ చేయడానికి అంగీకరించలేదు.

ఆ నేపథ్యంలో నుంచి చూస్తే మాత్రం ఇలాంటి కథను అంగీకరించిన మోహన్‌లాల్‌ని మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ఈ సినిమా అంతా కూడా టీఆర్పీ రేటింగ్స్ కోసం మీడియా వాళ్ళు పడే కక్కుర్తి, రాజకీయ నాయకుల అవినీతి వ్యవహారాలనే హైలైట్‌గా చూపించారు మరి. మీడియావాళ్ళకు కోపం వస్తే టార్గెట్ చేసి మరీ విమర్శస్తారన్న విషయం మోహన్‌లాల్‌కి తెలియనిదేమీ కాదు. కానీ ఒక నటుడిగా మోహన్‌లాల్ కమిట్మెంట్ అది.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే జర్నలిస్ట్ వేణు (మోహన్‌లాల్) పాలిటిక్స్ అన్నా, పొలిటికల్ లీడర్స్ అన్నా చాలా మందికి లాగే భయం. వాళ్ళు తల్చుకుంటే ఎవరినైనా, ఏమైనా చేయగలరు అని చెప్పి వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి భయపడుతూ ఉంటాడు. అలాంటి వేణూను ఒక భారీ అవినీతి వ్యవహారానికి సంబంధించిన కేసులో ఆధారాలు సేకరించమని చెప్తారు వేణు పనిచేస్తున్న చానల్ హెడ్స్. అది కూడా రేణు(అమలా పాల్) అనే జర్నలిస్ట్‌తో కలిసి ఆ ఆధారాలు సేకరించమని చెప్తారు. వేణు భయపడుతూ ఉంటాడు కానీ రేణూనే వేణూని కూడా ప్రోత్సహిస్తుంది. ఇద్దరూ కూడా ఓ బంపర్ ప్లాన్‌తో రంగంలోకి దిగుతారు. అయితే ఆధారాలు దొరికిన వెంటనే ఆ ఆధారాలను ప్రత్యర్థి ఛానల్ వారికి అమ్మేసుకుంటుంది రేణు. వేణు షాక్ అవుతాడు. అదే టైంలో వేణు, రేణుల విషయం తెలుసుకున్న ఒక మినిస్టర్ వేణు, రేణులను టార్గెట్ చేస్తాడు. వరుస సమస్యలు చుట్టుముట్టిన నేపథ్యంలో వేణు ఆ సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడు? ఫైనల్‌గా ఏం సాధించాడు అనేది కథ.

ఈ సినిమా కథ మొత్తం కూడా మలయాళ ప్రేక్షకుల అభిరుచుల మేరకు తయారు చేశారు. అలాగే రాజకీయ అంశాల చుట్టూ తిరిగే తెలుగు సినిమా ప్రేక్షకులకు కూడా ఈ సినిమా నచ్చుతుంది. మీడియా వాళ్ళు పనిచేసే విధానం, వాళ్ళకు వాళ్ళకు మధ్య ఉండే టీఆర్పీ రేటింగ్స్ కాంపిటీషన్స్ లాంటి విషయాలను చాలా సహజంగా, వివరంగా తెరకెక్కించడం బాగుంది. అలాగే పొలిటికల్ అంశాలను టచ్ చేయడం బాగుంది. మోహన్‌లాల్-అమలాపాల్ మధ్య వచ్చిన సంఘర్షణలో నుంచి పుట్టుకు వచ్చిన సీన్స్ కూడా బాగున్నాయి.

ఇక ఈ సినిమాకు ప్రధాన బలం అంటే మాత్రం మోహన్‌లాల్ అనే చెప్పుకోవాలి. మోహన్‌లాల్ నటనలో ఉండే మేజిక్ మరోసారి తెరపైన ఆవిష్కృతమైంది. సినిమాలో ఉన్న చాలా లోపాలను ఆ మేజిక్కే మేనేజ్ చేసేసింది. ఇక అమలాపాల్ కూడా క్యారెక్టర్‌కి తగ్గట్టుగా బాగా పెర్ఫార్మ్ చేసింది. మరీ ముఖ్యంగా నెగిటివ్ షేడ్స్‌కి సంబంధించిన సీన్స్‌లో మెప్పిస్తుంది. మిగతా ఆర్టిస్టులందరూ కూడా ఒకె. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం మరీ లౌడ్‌గా ఉంది. ఈ తరహా సినిమా అంటే చాలు…..మరీ లౌడ్ మ్యూజిక్ అందించడం మన ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్స్‌కి అలవాటు. ఈ సినిమాలో కూడా అదే చేశాడు. ఆ మ్యూజిక్ కాస్త ఇబ్బంది పెడుతుంది. కాస్త సెన్సిబుల్‌గా ఉంటే బాగుండేది. మిగతా సాంకేతిక అంశాలు ఒకె.

అయితే రాసుకున్న కథను పూర్తిగా ఆసక్తికర కథనంగా మార్చుకోవడంలో డైరెక్టర్ కొన్ని చోట్ల గాడితప్పాడు. సినిమా స్టార్టింగ్ బాగానే ఉంటుంది. ఆ తర్వాత అసలు కథలోకి ఎంటర్ అయినప్పుడు కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. అయితే మోహన్‌లాల్, అమలాపాల్ తప్పించుకుంటూ తిరిగే సీన్స్‌ని మాత్రం ఆసక్తికరంగా తెరకెక్కించలేకపోయాడు. అక్కడే సినిమా కాసేపు బోర్ కొడుతుంది. కథను దాటేసి ఇష్టం వచ్చినట్టుగా కథనం అల్లుకున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే ఛానల్స్ పోరాటం, రాజకీయ అవినీతి లాంటి విషయాలను సహజంగా తెరకెక్కించిన డైరెక్టర్….కథనం విషయంలో లాజిక్కులు వదిలేయడం, సినిమాటిక్‌గా కథనం సాగడం మాత్రం ఆకట్టుకోదు.

ఓవరాల్‌గా చెప్పాలంటే ఛానల్స్ టీఆర్పీలు, పొలిటికల్ అవినీతి నేపథ్యంలో చాలా వరకూ ఆసక్తికరంగానే సాగిన ఈ సినిమా కొన్ని చోట్ల బోర్ కూడా కొట్టేస్తుంది. పైన చెప్పిన విషయాల పట్ల మీకు ఆసక్తి ఉంటే మాత్రం ఈ సినిమాపైన ఓ లుక్ వెయ్యొచ్చు. ఇక సినిమాగా అంటే మాత్రం కాస్తంత బోర్ కొట్టినా ఫర్వాలేదు…..ఒకసారి చూద్దాం అనుకుంటే ‘బ్లాక్ మనీ’ థియేటర్‌లోకి అడుగు వెయ్యొచ్చు.

క్యాప్షన్ః కనుపాప, మన్యంపులిలా కాదు గానీ…బ్లాక్ మనీ కూడా జస్ట్ ఒకె…..

Related News

Comments

comments