నవ్విపోదురు గాక నాకేమి సిగ్గంటున్న బి.ఎ.రాజు!

తెలుగు సినిమా పరిశ్రమలో బి.ఎ.రాజు అంటే పి.ఆర్.ఓ.గా తిరుగులేని పేరుంది.ఆ పేరుతోనే ఆయనో వెబ్ సైట్ & ఫిల్మ్ వీక్లీ కూడా నడుపుతున్నారు.అంతవరకూ ఫర్లేదు…ఎందుకంటే వాటిని నడపడానికి సమాచారం చాలు…అది కావలసినంత ఉంటుంది ఆయన వద్ద.కాని ఆయన కొన్ని సంవత్సరాల నుంచి సినిమాలను నిర్మించే పనిలో పడ్డాడు.దానికి ఆయన దర్శకురాలు “జయ” గారు దర్శకత్వ బాధ్యతలు చూస్తున్నారు.అదేంటో మనదేశంలో ఎంతోమంది టాలెంట్ కలిగిన మహిళలు వంట ఇంట్లోనే వాళ్ళ టాలెంట్ అంతా వృధా చేసుకుంటున్నారు.కాని దురదృష్టవశాత్తూ వంటింటికి కూడా పూర్తిగా న్యాయం చేయలేని కొందరు మాత్రం వాళ్ళకి లేని టాలెంట్ ని ఊహించుకుని ప్రేక్షకుల మీదకు దండయాత్రకు వస్తుంటారు.ఆ రెండవ కోవకు చెందిన దర్శక వజ్రం ఈ “జయ” గారు.

ఈవిడ ఇప్పటివరకు మూడో నాలుగో సినిమాలు తీసారు.వాటి సంఖ్య ఎందుకు గుర్తులేదంటే వాటిలో గుర్తుపెట్టుకునేటంత విషయమేమీ లేదు.అంత చెత్త సినిమాలు తీసిన ఈవిడ కూడా,ఈవిడ లేటెస్ట్ దండయాత్ర అయిన “వైశాఖం” అనే సినిమాల పోస్టర్స్ పైన హీరో హీరోయిన్స్ కు బదులుగా ఈ మహా దర్శకురాలి ఫోటోలు వేయించుకున్నారు.”మగధీర” 100 రోజుల పోస్టర్ మీద రాజమౌళి గుర్రం మీద వెళ్తున్న స్టిల్ వేస్తానంటే వద్దన్నాడట.పొరపాటున అటువంటి సినిమా ఈవిడ కనుక తీసుంటే,ఈవిడ స్టిల్ డైనోసార్ మీద వెళ్తున్నట్టు వేయించే వారేమో.కాకపోతే మనం కంగారు పడాల్సిన అవసరం లేదు…ఎందుకంటే ఆవిడ “మగధీర” వంటి సినిమా ఈ జన్మకైతే తీయలేదు…కాబట్టి మనం సేఫ్.

అన్నిటికంటే ఘోరమైన విషయమేమిటంటే,ఆ “వైశాఖం” అనబడే దిక్కుమాలిన సినిమా రిలీజ్ అవ్వడం,అట్టర్ ఫ్లాప్ కావడం కూడా జరిగిపోయింది.కాని హైదరాబాద్ లోని ఒక ధియేటర్లో(అంజలి – సికింద్రాబాద్) ఈ సినిమా ఇంకా రన్ అవుతుంది.ఎవరు చూస్తున్నారని అడక్కండి…అడిగితే “ఎవరూ చూడటం లేదని” నిజం చెప్పాల్సి వస్తుంది.అంటే ప్రొజెక్టర్ ఆపరేటర్ ని నేను లెక్కలోకి తీసుకోలేదు…క్షమించాలి.మరి ఎవరూ లేకుండా ఎందుకు రన్ చేస్తున్నారు అంటే,బహుశ నష్టాల్లో ఉన్న ధియేటర్ యాజమాన్యాన్ని రెంట్ కట్టి కాపాడటం కోసం అనుకోకండి…”ఇంకొన్ని రోజులు అలా బండి లాగిస్తే 50 రోజులు పూర్తవుతాయి,దాంతో మా సినిమా అర్ధ శతదినోత్సవం జరుపుకుంది అని వాళ్ళే ఒక షీల్డ్ కొని తెచ్చుకుని,ఓ ఖాళీగా ఉన్న సెలెబ్రిటీని పిలుచుకుని బహుమతి తీసుకుని పత్రికల ఫోజులివ్వచ్చు”…అంతే.

ఒకప్పుడు ఈ దురదానందం పెద్ద హీరోలకు మాత్రమే ఉండేది.ఇప్పుడు ఆ జాఢ్యాన్ని దర్శకత్వానికి స్పెల్లింగ్ కూడా రాని ఈ దర్శకురాలు “జయ” వంటి వాళ్ళు కూడా అంటించుకోవడం ద్వారా మాత్రం,దర్శకురాలు “జయ” ఒక కొత్త ఒరవడికి నాంది పలికిందని చెప్పొచ్చు. కాని ఆవిడతో మొదలైన ఆ జబ్బు ఆవిడతోనే ఆగిపోవాలని కోరుకోవడం తప్ప మనం చేయగలిగిందేమీ లేదు. కాని మన “రాజు” గారి లాగే,అందరూ “నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు” అనుకుంటే మనల్ని ఎవరూ కాపాడలేరు…అదీ సంగతి.

More from my site

Comments

comments