హీరోయిన్ కం నిర్మాతగా రాశి ప్రయత్నం ‘లంక’ ఫలించిందా? రివ్యూ

raasi

తెలుగు భాషా నటి, సీనియర్ యాక్ట్రెస్ రాశి గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అప్పట్లో పెళ్ళిపందిరి, శుభాకాంక్షలు, గోకులంలో సీతలాంటి హిట్ సినిమాలలో మంచి గుర్తింపు ఉన్న హీరోయిన్ పాత్రలతో మెప్పించింది రాశి. ఆ తర్వాత హాట్ హాట్ క్యారెక్టర్స్‌లోనూ ట్రై చేసింది కానీ వర్కవుట్ అవలేదు. ఆ తర్వాత నిజంలాంటి సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేసినప్పటికీ కలిసొచ్చింది ఏమీలేదు. ఇక లాభం లేదని వెంటనే ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌ని పెళ్ళి చేసుకుంది రాశి. చాలా కాలం తర్వాత ఇప్పుడు మళ్ళీ స్వీయ నిర్మాణంలో…తన ఓ కీలక పాత్రను పోషిస్తూ…భర్త డైరెక్షన్‌లోనే తెరకెక్కిన ‘లంక’ సినిమాతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది రాశి. మరి ఈ ‘లంక’లో రాశి నిండా మునిగిపోయిందా? లేక లంక పుణ్యమాని మళ్ళీ నిలబడే స్థాయికి వచ్చే ఛాన్స్ ఉందా?

లంక సినిమా కోసం ఎంచుకున్న కథ చాలా బాగుంది. కొత్తగా ఉంది. ఎదుటి వ్యక్తి మనసులోని భావాలను తెలుసుకుంటూ వాళ్ళతో మమేకమయ్యే టెలీపతి కళ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం లంక. పాయింట్ చాలా చిన్నదే. కానీ ఆసక్తికరంగా మలిస్తే రెండు గంటల పాటు ప్రేక్షకుడిని కట్టిపడేయడం పెద్ద కష్టం కాదు. అసలు డైరెక్టర్ చెప్పిన కథను ఒకసారి పరిశీలిస్తే……….

అనాథ అయిన స్వాతి మలయాళం సినిమా పరిశ్రమలో హీరోయిన్‌గా ఎదుగుతూ ఉంటుంది. సింగిల్‌గా ఉన్న మహిళలను టార్గెట్ చేయడం…వాళ్ళను లోబరుచుకోవడం చేస్తూ ఉండే సిజ్జు కన్ను స్వాతిపైన పడుతుంది. ఆ విషయం తెలుసుకున్న స్వాతి భయపడుతుంది. ఆ దుర్మార్గుడికి దూరంగా అమెరికా పారిపోవాలని నిర్ణయించుకుంటుంది. వీసా కోసం ఎదురు చూస్తూ ఉన్న స్వాతికి హైదరాబాద్ శివార్లలో ఉన్న ఒక బంగ్లాలో ఓ షార్ట్ ఫిల్మ్ షూటింగ్‌లో పాల్గొనక తప్పని పరిస్థితి వస్తుంది. ఆ షూటింగ్ సమయంలోనే అదే బంగ్లాలో ఉన్న రెబాకా(రాశి)తో స్వాతికి పరిచయం అవుతుంది. రెబాకాతో ఉంటే సేఫ్‌గా ఉంటుందని భావించిన స్వాతి షూటింగ్ జరిగినన్ని రోజులు అదే బిల్డింగ్‌లో రెబాకాతోనే కలిసి ఉంటుంది. ఇలా జరుగుతుండగానే స్వాతి హత్యకు గురైందన్న ఒక వార్త అందరినీ షాక్‌కి గురి చేస్తుంది. అసలు స్వాతిని చంపింది ఎవరు? రెబెకానా? లేక సిజ్జూనా? స్వాతిని ఎందుకు చంపారు అన్నది మిగతా కథ.

సినిమాలో కీలకమైన టెలీపతి పాయింట్ వరకూ చాలా బాగుంది. ఆ పాయింట్ నచ్చే ఈ సినిమాని నిర్మిస్తూ యాక్ట్ చేశానని రాశి కూడా చెప్పుకుంది. అయితే ఆ పాయింట్‌ని డీల్ చేయడంలో మాత్రం డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. సింగిల్ పాయింట్‌తో ఒకే థీమ్‌లో గ్రిప్పింగ్‌గా …షార్ప్‌గా ఉండాల్సిన కథలో అనవసరమై ట్విస్ట్‌లు, అవసరం లేని ఉపకథలను కలిపి బోర్ కొట్టించేశాడు. సినిమా ఆసాంతం ట్విస్ట్‌లు ఉంటే ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తారని డైరెక్టర్ భావించినట్టున్నాడు కానీ ఓ చిన్న పాయింట్‌ని పట్టుకుని…ఇక దాని చుట్టూ కథను రకరకాలుగా అల్లుకుంటూ పోతాను……క్లైమాక్స్‌లో అసలు విషయం చెప్పేవరకూ కొత్త కొత్త యాంగిల్స్ యాడ్ చేస్తూ ఉంటాను అంటే ఎవరికి మాత్రం ఆసక్తి ఉంటుంది. ఈ సినిమా విషయంలో కూడా అదే తప్పు జరిగింది. స్వామిరారా తరహా సినిమాల స్టైల్‌లో సింగిల్ పాయింట్ మీద నడవాల్సిన కథను రకరకాలుగా తిప్పి బోర్ కొట్టించేశారు.అసలు విషయంపైన ఉన్న ఆసక్తిని కూడా చంపేశారు.

చాలా కాలం తర్వాత తెరపైన కనిపించిన రాశి యాక్టింగ్ మాత్రం చాలా చాలా బాగుంది. కొన్ని సార్లు భయపెట్టడంలో బాగానే సక్సెస్ అయింది. ఇక మిగతా ఆర్టిస్ట్‌లు కూడా ఒకే అనిపిస్తారు. టెక్నీషియన్స్ అవుట్ పుట్ కూడా బడ్జెట్‌కి తగ్గట్టుగానే ఉంది. ఫొటోగ్రఫి బాగుంది. అలాగే మ్యూజిక్ కూడా ఒకె. ఎడిటింగ్ బాగాలేదు. సినిమాలో ఉన్న అనవసరమైన సీన్స్‌ని ఎడిటింగ్ టేబుల్ పైన అయినా కత్తిరించి ఉండాల్సింది.

మొత్తంగా టెలీపతి అనే ఓ మంచి పాయింట్ అనుకున్న రాశి భర్త, డైరెక్టర్ శ్రీముని….ఆ కథను గ్రిప్పింగ్‌గా చెప్పే విషయంలో మాత్రం తడబడ్డాడు. అసలు విషయం ప్రేక్షకులకు ఎక్కడ తెలిసిపోతుందో అన్న భయంతో సినిమా క్లైమాక్స్ వరకూ కూడా రకరకాల కథలు, సన్నివేశాలు అల్లి కలగాపులగం చేసి కన్ఫ్యూజ్ చేసి పడేశాడు. ఇంతకంటే కూడా అనుకున్న పాయింట్ చుట్టూ నిజాయితీగా చాలా తక్కువ సీన్స్ రాసుకుని……గ్రిప్పింగ్‌గా తెరపైకి తీసుకుని వచ్చి ఉంటే ఈ లంకలో సినిమా నిర్మాత రాశిని బాక్స్ ఆఫీస్ దగ్గర విజేతగా నిలబెట్టి ఉండేది. ప్రస్తుతానికి మాత్రం అంత సీన్ లేకుండా పోయింది.

ఫైనల్ వర్డ్ః బాక్స్ ఆఫీస్ ‘లంక’ దాటడం కష్టమే…….

Related News

Comments

comments