జగన్ సభకు వెళ్లే విద్యార్థులపై క్రిమినల్ కేసులు : మంత్రి

రాజకీయాలలో ఎదురు దాడులు, వ్యూహ ప్రతివ్యూహాలు సహజమే గాని దానికి ఓ పరిమితి వుండాలి. టిడిపి నేతలూ, మంత్రులూ ప్రతిపక్ష వైసీపీ నేత జగన్‌ మోహన్ రెడ్డిపై దాడి చేయడం ఓకే. శాసనసభలోనూ తరచూ జగన్‌ఫై ఉన్న కేసుల గురించి ఆరోపణలూ నడుస్తూనే వుంటాయి. కోర్టులో తేలే వరకు ఇది సహజమే. అయితే ఆ ధోరణి శ్రుతిమించిపోవడమే అవాంఛనీయం. జగన్‌ ప్రతిపక్ష నేత కనుక రాష్ట్రానికి సంబంధించిన అన్ని విషయాలపై మాట్లాడ్డం అయన బాధ్యత. గత కొంతకాలంగా వదలిపెట్టిన ప్రత్యేక హౌదా సమస్యను మళ్లీ పైకి తీసి అనంతపురంలో యువభేరి నడుపుతున్నారు. ఈ సభలో ఆయన గతంలో చెప్పిన రాజీనామాల ప్రతిపాదన కూడా పునరుద్గాటించారు. తమ ప్రభుత్వంపై దాడిని టిడిపి ఖండించవచ్చు గాని హోదా విషయంలో ఆయనను తప్పుపట్టాల్సిన అవసరం లేదు.

తెలుగుదేశం మంత్రి వర్యులు పత్తిపాటి పుల్లారావు మాత్రం తనకు అలవాటైన దాడి బాణీలో ఈ ప్రత్యేక హోదా యువభేరి సభపై ముందే విరుచుకుపడ్డారు. జగన్‌కు మాట్లాడే అర్హతే లేదన్నారు. అంతటితో ఆగకుండా ఈ సభలకు వెళితే విద్యార్థులు కూడా క్రిమినల్ కేసులు ఎదుర్కోవలసి ఉంటుందని భయపెట్టారు. జగన్‌పై కోపంతో తాము ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు సదరు మంత్రి గారికి. ఒక రాజకీయ సమస్యపై సభకు వెళితే క్రిమినల్స్‌ అయ్యేట్టయితే ఇప్పటికి ఆంధ్ర ప్రదేశ్ లో సగభాగం నేరస్తులై వుండాలి. ఎందుకంటే జగన్‌ సభలకు లక్షల సంఖ్యలోనే జనం హాజరైనారు. వైసీపీపైనగానీ, వాళ్ళ నాయకుడిపైన గానీ రాజకీయంగా విమర్శలు చేయొచ్చు. కానీ ఇటువంటి విపరీతపు మాటలు విద్యార్థులపై ప్రయోగించడం చేతకాని దద్దమ్మలు చేసేపని.

More from my site

Comments

comments