రుణమాఫీ అడిగిన రైతుపై విరుచుకుపడిన ఉపముఖ్యమంత్రి

తనకు రుణ మాఫీ కాలేదని అడిగిన రైతుపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు. అసహనంతో  ‘షటప్‌.. డోంటాక్‌.. నాన్‌సెన్స్‌.. వింటే విను లేకుంటే వెళ్లిపో. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా! నేను డిప్యూటీ సీఎం. ముఖ్యమంత్రి తర్వాత అంతటి స్థాయి ఉన్న వ్యక్తిని. సారా తాగిన నాయాళ్లతో ఇక్కడికొచ్చి అల్లరి చేస్తారు. మీ కోసం పనులు చేయడానికి వచ్చా. చేతులు చూపించి మాట్లాడతావా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్షన్‌ గ్రామాల్లో తిరిగినట్లు మాట్లాడితే కుదరదు.

ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మంగళవారం కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పులకుర్తిలో జరిగిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో రైతుపై కేకలు వేయడం చూసి కార్యకర్తలు సైతం విస్తుపోయారు. అంతకు ముందు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కాంగ్రెస్‌ నుంచి వచ్చిన వారేనని వ్యాఖ్యానించారు. ‘1978లో నేను డోన్‌ నుంచి ఇందిరా కాంగ్రెస్‌ తరఫున పోటీ చేశా. చంద్రబాబు కూడా అదే సంవత్సరం ఇందిరా కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేశారు. ఆ తర్వాత ఇద్దరం టీడీపీలో చేరాం’ అని అన్నారు.

ఎంపీ బుట్టా రేణుక తెలుగుదేశం పార్టీలో చేరడం, తమను కనీసం సంప్రదించకపోవడం వంటి పరిణామాలతో కేఈ కుటుంబం ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. అదీ గాక కేఈ ప్రభాకర్ కర్నూలు ఎంపీ సీటును ఆశించారు. అయితే, తాజా పరిణామాల ప్రభావం వల్ల ఏమి చేయాలో అర్థం గాక రైతులపై మండిపడుతున్నారని అక్కడికొచ్చిన రైతులు గుసగుసలాడుకొంటున్నారు.

More from my site

Comments

comments