‘ఉన్నది ఒకటే జిందగీ’ రివ్యూ

స్నేహం, ప్రేమ అంటూ యూత్‌ని టార్గెట్ చేయడం బాగుంది. ‘నేను….శైలజ’ సక్సెస్‌ని క్యాష్ చేసుకోవాలన్న ప్రయత్నం కూడా బాగుంది. కానీ కమర్షియల్ లెక్కల గురించి ఆలోచించినంతగా ఎమోషన్స్ గురించి ఆలోచించలేకపోతే ఎలా? రిలేషన్స్‌లో ఎమోషన్స్ లేకుండా డైలాగులతో మెప్పిస్తామని ప్రయత్నం చేస్తే మొదటికే మోసం రాదా? రాదా అనే ఫ్రశ్నే అవసర్లేదు. ఉన్నది ఒకటే జిందగీ సినిమా ప్రేక్షకులను ఎమోషనల్‌గా కనెక్ట్ చేయలేకపోయింది. జిందగీ కాస్తా బర్బాత్ అయిపోయింది. ఎమోషన్ మిస్సయిన ఎఫెక్ట్ కాస్తా బాక్స్ ఆఫీస్‌పైన కూడా బలంగా పడడం ఖాయం.
స్నేహం, ప్రేమ అనే ఎమోషన్స్ అనగానే మనకు ప్రేమదేశం సినిమా గుర్తొస్తుంది. హిందీలో అయితే ఎన్నో సినిమాలు ఉన్నాయి కానీ తెలుగులో కాస్త తక్కువే. ఆ రెండు ఎమోషన్స్ కూడా యూత్ బాగా ఓన్ చేసుకునేవే కాబట్టి కమర్షియల్ సక్సెస్ కూడా గట్టిగానే ఉంటుంది. కానీ ఆ స్నేహంలో కానీ ప్రేమలో కానీ ఎమోషన్స్ పూర్తిగా మిస్సయితే అదే ఉన్నది ఒకటే జిందగీ సినిమా.
చాలా తెలుగు సినిమాల్లో లాగే పెద్దగా బలమైన రీజన్ అంటూ ఏమీ లేకుండానే రామ్, శ్రీ విష్ణులు స్కూలింగ్ టైంలోనే ఫ్రెండ్స్ అయిపోతారు. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవ్వడం కోసం రాసుకున్న సీన్ కానీ ఆ సీన్ తెరపైకి వచ్చిన విధానం కానీ ఎఫెక్టివ్‌గా లేకపోవడం అనేది ఆ తర్వాత సినిమా అంత ప్రభావం చూపించింది. అంత కీలకమైన సన్నివేశాన్నే పేలవంగా రాసుకున్న డైరెక్టర్ ఆ తర్వాత ఏ స్థాయిలోనూ మెప్పించలేకపోయాడు. ఫస్ట్ హాఫ్‌లో అనుపమ పరమేశ్వరన్-రామ్‌ల లవ్ స్టోరీ బాగా లేదని అనుకుంటే సెకండ్ హాఫ్‌లో రామ్-లావణ్య త్రిపాఠిల లవ్ స్టోరీని అంతకంటే బ్యాడ్‌గా తీర్చిదిద్దాడు డైరెక్టర్. ఈ ఇద్దరు అమ్మాయిల వళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ అయిన రామ్, శ్రీ విష్ణుల మధ్య ఎలాంటి విభేదాలు వచ్చాయి? ఎలా కలిసిపోయారు? అన్నదే ఉన్నది ఒకటే జిందగీ సినిమా కథ. కథను ఇంతకుమించి చెప్పేస్తే ఇక సినిమాకు వెళ్ళి చూడడానికి ఏమీ ఉండదు. అందుకే చెప్పట్లేదు.
నేను….శైలజ సినిమాలో హీరోయిన్ క్యారెక్టరైజేషన్‌తో పాటు తండ్రి-కూతురు మధ్య ఎమోషన్స్‌ని కూడా అద్భుతంగా పండించి సక్సెెస్ అయిన కిషోర్ తిరుమల ఈ సారి మాత్రం పూర్తిగా డిసప్పాయింట్ చేశాడు.

ఇద్దరు హీరోయిన్స్ పాత్రలను తీర్చిదిద్దిన విధానం టూ బ్యాడ్ అన్నట్టుగా ఉంటుంది. ఒక్క విషయంలో కూడా ఇంప్రెసివ్‌గా అనిపించదు. సెకండ్ హాఫ్‌లో వచ్చే లావణ్య త్రిపాఠి క్యారెక్టరైజేష్‌, లావణ్య కాస్ట్యూమ్స్, మేకప్ అంతా కలిపి సినిమాపైన ఇంప్రెషన్నే పూర్తిగా చెడగొట్టాయి. ఈ సినిమా చూశాక లావణ్యకు మళ్ళీ మోడరన్ అమ్మాయి క్యారెక్టర్ ఇవ్వడానికి ఏ డైరెక్టర్ కూడా ముందుకు రాడు అని చెప్పడానికి సందేహించక్కర్లేదు. సినిమా అంతా కూడా ఒకే ఎక్స్‌ప్రెషన్‌తో కనిపించిన అనుపమ విసిగించింది. సినిమాకే కీలక పాత్రధారి అయిన అనుపమ క్యారెక్టర్‌ని కనీస స్థాయిలో కూడా డిజైన్ చేయలేకపోయాడు డైరెక్టర్. అందుకే ఆ అమ్మాయికి కూడా చేయడానికి ఏమీ స్కోప్ లేకుండా పోయింది…….ఒక ఫ్టాట్ ఎక్స్‌ప్రెషన్‌తో చూస్తూ ఉండడం తప్ప.
రెండు లవ్ స్టోరీలను కూడా బ్యాడ్‌గా రాసుకుని తెరకెక్కించిన డైరెక్టర్……రామ్-శ్రీ విష్ణుల ఫ్ఱెండ్షిప్ కథ విషయంలో కూడా పూర్తిగా ఫెయిలయ్యాడు. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యే సీన్, ఆ తర్వాత విడిపోయే సీన్……ఆ తర్వాత మళ్ళీ కలిసే సీన్….ఏ ఒక్కటి కూడా మనసుకు హత్తుకోదు. విడిపోయే సీనే బాగా లేదు అనుకుంటే ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసే సీన్ ఇంకా బ్యాడ్‌గా ఉంటుంది. ఆ సీన్ చూసిన వెంటనే ఇక సినిమాలో ఏమీ లేదన్న విషయం అందరికీ అర్థం అయిపోతుంది. ఈ సినిమాలోనే ఓ పాటలో రామ్ చెప్పినట్టు టీజర్ చూసి సినిమాకొచ్చి దెబ్బయిపోయాం అన్న ఫీలింగ్ వస్తుంది. డైరెక్టర్‌ని, హీరోని వాట్ అమ్మా….వాట్ ఈజ్ దిస్ అమ్మా అని అడగాలని అనిపిస్తూ ఉంటుంది. స్నేహం, ప్రేమ తాలూకూ ఎమోషన్స్ హృద్యంగా చూపించడంలో పూర్తిగా ఫెయిల్ అయిన డైరెక్టర్ ఎక్కడా కూడా ఇంప్రెస్ చేయలేకపోతాడు. అక్కడే జిందగీ సినిమా బాక్స్ ఆఫీస్ ఫలితం తేలిపోయింది.
అయితే సినిమా మరీ వరస్ట్ అని చెప్పే అవకాశం లేకుండా పెళ్ళిచూపులు ఫేం ప్రియదర్శి చేశాడు. ప్రియదర్శి కనిపించిన ప్రతి కామెడీ సీన్ కూడా పైసా వసూల్ అనిపించే స్థాయిలో ఉంటుంది. సినిమా కథలో ఇన్వాల్వ్ అవ్వలేక బోర్ ఫీలవుతున్న ప్రేక్షకులకు తన నవ్వుల విందుతో రిలీఫ్ ఇచ్చాడు ప్రియదర్శి. సీన్స్‌లో కంటెంట్ లేకపోయినా, డైలాగ్స్‌లో పంచ్‌లు లేకపోయినా తన యాక్టింగ్ శైలి, ఎక్స్‌ప్రెషన్స్‌తోనే హిలేరియస్‌గా నవ్విస్తాడు ప్రియదర్శి. ఉన్నది ఒకటే జిందగీ సినిమాలో ఉన్న ఒకే ఒక ప్లస్ పాయింట్ అదే. రామ్, శ్రీ విష్ణు, అనుపమ, లావణ్యతో సహా అందరూ కూడా సినిమా ఆసాంతం ఏదో పొగొట్టుకున్నవాళ్ళలాగానే ఉండి ప్రేక్షకులు నిట్టూరుస్తూ కూర్చునేలా చేస్తారు. ఆ నిట్టూర్పులను కాస్త తగ్గించి ఉషారు తెప్పించిన ఒకే ఒక్క ఆర్టిస్ట్ ప్రియదర్శి.
రామ్‌తో సహా మిగతా ఆర్టిస్ట్‌ల పెర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటే సినిమా ఎలాగూ బాగా లేదని అర్థమై లైట్ తీసుకుని ఏదో మేనేజ్ చేశారా అన్న అనుమానం వస్తుంది. ఈ సినిమాను ఇంటికి తీసుకెళతారు, గుండెల్లో పెట్టుకుంటారు అని రామ్ చెప్పాడు కానీ సినిమా థియేటర్‌లో ఉన్నంతసేపు కూడా గుర్తుండని సినిమా ఇది. ఒక్కసారి కూడా హార్ట్‌ని టచ్ చేయలేపోయిన బోరింగ్ సినిమా ఉన్నది ఒకటే జిందగీ. మొదటి సినిమాతో ఇంప్రెస్ చేసిన కిషోర్ తిరుమల ఈ సినిమాతో మాత్రం పూర్తిగా డిసప్పాయింట్ చేశాడు. త్రివిక్రమ్ స్టైల్‌లో తను రాసిన సింగిల్ లైన్ డైలాగ్స్ కూడా చాలా సార్లు మీనింగ్‌లెస్ అనిపిస్తాయి. ఇక దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పుణ్యమాని ఒక కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ ఎక్కడా రాదు. అంత రిపీటెడ్ అండ్ ఓల్డ్ మ్యూజిక్ ఇచ్చిన దేవీ సినిమాను కిల్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. సాంగ్స్ విషయం పక్కనపెట్టినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు దేవీ.
ప్రేమ కంటే స్నేహం గొప్పది అని చెప్పాలన్న ప్రయత్నం ఒకే కానీ ఆ ప్రయత్నం మరీ ఇంత అథమ స్థాయిలో బోర్ కొట్టిస్తే ప్రేక్షకుల మనసులను గెల్చుకోవడం చాలా కష్టం అమ్మా……సినిమా అయిపోయాక ఇంటికి తీసుకెళ్ళడం తర్వాత వాట్ అమ్మా? వాట్ ఈజ్ దిస్ హెడేక్ అమ్మా? అని అడిగేలా ఉన్న జిందగీలో ప్రియదర్శి కామెడీ ఒక్కటే రిలీఫ్.
రేటింగ్ః 2.25/5

More from my site

Comments

comments